Asianet News TeluguAsianet News Telugu

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి కేంద్రం ఆదేశం:కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీని తేల్చాలని కృష్ణా ట్రిబ్యునల్ ను కేంద్రం ఆదేశించింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీ తేలనుంది. 

Union Cabinet orders to krishna water dispute tribunal to allocate project wise water Andhra Pradesh and Telangana lns
Author
First Published Oct 4, 2023, 3:52 PM IST

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య  కృష్ణా జలాల పంపిణీకి  కృష్ణా ట్రిబ్యునల్ ను  కేంద్రం ఆదేశించిందని  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన  కేంద్ర కేబినెట్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలకు  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై  రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.ఈ తరుణంలో  ట్రిబ్యునల్ ఏర్పాటుకు  కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

 కేంద్ర కేబినెట్ నిర్ణయాలను  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్  బుధవారంనాడు మీడియాకు వివరించారు. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను  ఈ ట్రిబ్యునల్ చేయనుందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.కొత్త నిబంధనలు రూపొందించాలని  ట్రిబ్యునల్ ను ఆదేశించినట్టుగా  మంత్రి తెలిపారు.ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను ఉంచుకొని జలాలను పంపిణీ చేయనుందని  అనురాగ్ ఠాకూర్ చెప్పారు.కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని చాలా కాలంగా తెలంగాణ కోరుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి ఠాకూగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.

also read:కేంద్ర కేబినెట్ ఎజెండాలో తెలంగాణ అంశాలు: హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి

కృష్ణాజలాలపై  కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య గతంలో చర్చలు జరిగిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో తమ వాటా తేల్చాలని  తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలును కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ఈ విషయాన్ని తాము పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సుప్రీంకోర్టులో కేసును తెలంగాణ సర్కార్ వెనక్కు తీసుకుందన్నారు.కృష్ణా జలాలపై వివాదాన్ని పరిష్కరించిన కేంద్రానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

రాష్ట్ర విభజన తర్వాత 2017లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య  కృష్ణా జలాల పంపిణీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం కేటాయించారు. ఈ లెక్కన కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు కేటాయించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios