తెలంగాణకు బీజేపీ ఎన్నికల తాయిలాలు:కేంద్ర కేబినెట్‌లో మూడు కీలకాంశాలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలోని మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తాయిలాలను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 6వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో బుధవారంనాడు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణకు చెందిన మూడు అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు ములుగులో గిరిజన యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ నెల 1వ తేదీన మహబూబ్ నగర్ పర్యటనకు వచ్చిన సమయంలో తెలంగాణలో పసుపు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ములుగులో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.తెలంగాణకు చెందిన మూడు అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ములుగులో గిరిజన యూనివర్శిటీ, నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు, కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చాలని కేంద్రం ట్రిబ్యునల్ ను ఆదేశించింది.
కృష్ణా జలాలను పున:పంపిణీ చేయాలని కేంద్రాన్ని పలు దఫాలు తెలంగాణ సర్కార్ ను కోరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేసీఆర్ సర్కార్ చేపట్టింది. దీంతో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. గత మాసంలో మహబూబ్ నగర్ లో నిర్వహించిన సభలో కృష్ణా జలాల్లో నీటి వాటాను తేల్చాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు దఫాలు పర్యటించిన నరేంద్ర మోడీ తెలంగాణకు వరాలు కురిపించారు. ఈ నెల 1, 3 తేదీల్లో మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన బీజేపీ సభల్లో పాల్గొన్నారు. అదే సమయంలో వేల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
తెలంగాణలో ఈ దఫా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాంతో ముందుకు సాగుతుంది. గత కొంతకాలంగా బీజేపీని లక్ష్యంగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు తమ కార్యాచరణతో కౌంటర్ ఇచ్చింది కమలం పార్టీ. ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న తరుణంలో తెలంగాణకు సంబంధించిన అంశాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చకు దారితీసింది. ఎన్నికల్లో లబ్ది కోసమే కేంద్రం ఇవాళ కేబినెట్ లో ఈ మూడు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
నిజామాబాద్ రైతులు పసుపు బోర్డు ఏర్పాటు విషయమై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు అంశం ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా బీజేపీకి కలిసివస్తుందో లేదో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ విషయమై రెండు రాష్ట్రాల సీఎంలు ప్రధాని,కేంద్ర మంత్రులను కలిసిన సమయంలో ఈ విషయమై చర్చిస్తున్నారు.