మెగా డిఎస్సీ కోసం మహా పాదయాత్రసెప్టెంబరు 5న ప్రారంభంకాకతీయ యూనివర్శిటీ నుంచి ఉస్మానియాకుసర్కారు పై వత్తిడి పెంచడమే లక్ష్యం
తెలంగాణ సర్కారు కళ్లు తెరిపించడమే లక్ష్యంగా మెగా డిఎస్సీ సాధన కోసం విద్యార్థి నేతలు నడుం బిగించారు. అదిగో డిఎస్సీ, ఇదిగో డిఎస్సీ అని చేస్తున్న తీపి ప్రకటనల డొల్లతనాన్ని చాటిచెప్పేలా మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే డిఎస్సీ అనే ప్రకటనలు కడుపు నింపవని సర్కారుకు తేల్చి చెప్పేందుకు ఒక్కో అడుగు ముందుకేయాలని సంకల్పించారు.
సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం నాడు మహాపాదయాత్రకు రూకల్పన చేసింది తెలంగాణ నిరుద్యోగ జెఎసి. మెగా డిఎస్సీ లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు జెఎసి ఛైర్మన్ కోటూరి మానవత్ రాయ్ వెల్లడించారు.
ఈ మహాపాదయాత్ర రెండు చారిత్రక యూనివర్శిటీల మధ్య చేపట్టనున్నట్లు తెలిపారు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీ నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. సెప్టెంబరు 5న కాకతీయ యూనివర్శిటీలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని విద్యార్థి లోకం పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి జిల్లా వరంగల్ కాబట్టి అక్కడి నుంచే డిఎస్సీ సాధన కోసం పాదయాత్ర చేయడం ద్వారా అటు విద్యాశాఖ మంత్రి మీద, హైదరాబాద్ ఓయు వరకు చేపట్టడం ద్వారా సిఎం మీద ఏకకాలంలో వత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్రకు రూపకల్పన చేసినట్లు కోటూరి తెలిపారు.
