తాగుడుకు బానిసై, చిత్రహింసలు పెడుతున్న భర్తను హతమార్చిందో భార్య. అనంతరం తానే చంపానని పోలీసుల ఎదుట లొంగిపోయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్య పల్లెలో జరిగి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు చెప్పిన వివరాల ప్రకారం.. 

రాయికల్‌ మండల కేంద్రానికి చెందిన అలకుంట లక్ష్మయ్యకు కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెకు చెందిన కళావతికి 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తాగుడుకు బానిసైన లక్ష్మయ్య రోజూ తాగి గొడవకుదిగేవాడు. ఈ మధ్య మరీ ఎక్కువవ్వడంతో కళావతిని ఆమె తల్లిదండ్రులు తిమ్మయ్యపల్లికి తీసుకెళ్లారు. లక్ష్మయ్య అక్కడికి కూడా వచ్చి భార్యాబిడ్డలను వేధించేవాడు. శనివారం రాత్రికూడా లక్ష్మయ్య తాగొచ్చి భార్య కళావతి, అత్త ఎల్లవ్వతో గొడవపడ్డాడు. గొడవలో ఎల్లవ్వ తలకు తీవ్రగాయమైంది. 

ఎల్లవ్వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గ్రామానికి వెళ్లేసరికి లక్ష్మయ్య తాగి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. గ్రామస్తులు లక్ష్మయ్యను పంచాయితీ భవనం వద్ద చెట్టుకు కట్టేశారు. అర్థరాత్రి తర్వత లక్ష్మయ్య మెలుకువలోకి వచ్చి కట్టు విప్పుకున్నాడు. భార్య, అత్తల మీద మరోసారి దాడికి దిగాడు. 

గ్రామస్తులు మళ్లీ పట్టుకుని అతడిని తాళ్లతో కట్టేశారు. అయితే అప్పటికే విసిగిపోయిన కళావతి లక్ష్మయ్యను కర్రతో తలపై బాది, కత్తితో గొంతులో పొడిచి చంపింది. లక్ష్మయ్యను తానే చంపేశానని ఆదివారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. కళావతిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.