కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి భారీ దెబ్బ

First Published 18, Nov 2017, 3:01 PM IST
uma madhavareddy to join TRS major setback to revanth grand plan against TRS
Highlights
  • రేవంత్ కు ఊహించని పరిణామం
  • కాంగ్రెస్ నేతల అయోమయం
  • కలవరపెడుతున్న అధికార టిఆర్ఎస్

 

కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఆదిలోనే ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. ఆయన ఏ అంచనాలతో కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఆ అంచనాలు తలకిందులయ్యే సంఘటన ఒకటి జరిగింది. మరి అంతగా భారీ ఎదురుదెబ్బ రేవంత్ కు ఏం తలిగిందబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి.

తెలంగాణలో కేసిఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ కోసం రేవంత్ రెడ్డి నడుం బిగించారు. అందుకోసమే ఆయన రోజు రోజుకూ బలహీనపడుతున్న తెలుగుదేశం పార్టీని వీడి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో చేరారు. ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి తన మద్దతుదారులతో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పించుకున్నారు. టిడిపి పార్టీ అంటే తనకు అభిమానం ఉన్నదని, అయినా తన రక్తంలో పసుపు రక్తమే ప్రవహిస్తోందని కూడా డైలాగ్ లు పేల్చారు రేవంత్. కేవలం 2019లో కేసిఆర్ ను గద్దె దించడమే ఏకైక లక్ష్యంతో తాను ఉన్నానని, అందుకోసమే కాంగ్రెస్ లో చేరానని కూడా చెప్పారు రేవంత్.

ఇదంతా బాగానే ఉంది కానీ.. రేవంత్ కాంగ్రెస్ లో చేరడంతో భారీ అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ తో పాటు టిడిపి పెద్ద నేతలంతా కాంగ్రెస్ గూటికి క్యూ కడతారని భావించింది. టిడిపి నేతలతోపాటు ఓటు బ్యాంకు సైతం కాంగ్రెస్ కు ధారాదత్తం అవుతుందన్న అంచనాల్లో ఉంది. రేవంత్ తో పాటు మరో 18 మందికి రాహుల్ కండువాలు కప్పినారు. మరికొందరు ఎఐసిసి ఆఫీసులో జాయిన్ అయ్యారు. రేవంత్ తో పాటు జాయిన్ అయిన వారిలో అందరిదీ యువరక్తమే. రాజారాం యాదవ్, మేడిపల్లి సత్యం, దరువు ఎల్లన్న, బాల లక్ష్మి లాంటి వారంతా విద్యార్థి దశ నుంచి ఇప్పుడిప్పుడే రాజకీయ అరంగేట్రం చేస్తున్నవారు. వారితోపాటు పెద్ద తలకాయ అంటే బోడ జనార్దన్, ములుగు సీతక్క, అరికెల నర్సారెడ్డి,  పెద్దపల్లి విజయరమణారావు లాంటి వాళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారున్నారు. ఇంకొందరు ఉన్నా రాజకీయంగా ప్రాముఖ్యత సంపాదించిన వారు కాదు. మరి రేవంత్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి మూడు వారాలు కావొస్తున్నది. వీళ్లు తప్ప మిగతా టిడిపి వాళ్లు కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తలేదు.

ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా కీలక నాయకురాలు మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి టిఆర్ఎస్ వైపు అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆమె అసెంబ్లీలో సిఎం కేసిఆర్ ను కలవడం చర్చనీయాంశమైంది. ఆమె తన భర్త (దివంగత మంత్రి) మాధవరెడ్డి పేరిట స్థలం ఇవ్వాలని సిఎం కేసిఆర్ ను కోరారు. ఉన్న ఫలంగా ఉమామాధవరెడ్డి కేసిఆర్ ను కలవడం రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. ఆమె కారెక్కడం ఖాయమన్న ప్రచారం షురూ అయింది. అయితే ఆమె ఇప్పటికీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా రేవంత్ పార్టీ మారిన తర్వాత ఆమె కేసిఆర్ ను కలవడం చూస్తే పరిణామాలన్నీ ఆమె టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖామన్నట్లు ఉన్నాయి.

నిజానికి ఆమెతోపాటు మరికొంత మంది టిడిపి సీనియర్లు కూడా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. రేవంత్ వైపు నుంచి కూడా ఆ దిశగా సమాచారాన్ని కాంగ్రెస్ పెద్దలకు చేరవేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద నేతలు వస్తారన్న ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో నల్లగొండ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి రేవంత్ సన్నిహితుడే అయినా ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరకుండా టిఆర్ఎస్ లో చేరిండు. ఇదేకాకుండా ఇప్పుడు ఉమా మాధవరెడ్డి సైతం కారెక్కేందుకు సన్నద్ధమవుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ క్రెడిట్ రేవంత్ కు దక్కేది. కానీ స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఆమె టిఆర్ఎస్ వైపు టర్న్ తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి.

ఆమె టిఆర్ఎస్ లో చేరిపోతే మాత్రం రేవంత్ లిస్ట్ నుంచి ఒక పెద్ద నేత పేరు మాయం అయిపోతుంది. రేవంత్ కు ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే ఆమె రేవంత్ రెడ్డి సామాజికవర్గం కూడా కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. రేవంత్ సామాజికవర్గం వారినే టిఆర్ఎస్ ఆకర్ష్ పేరుతో పార్టీలో చేర్చుకోవడం రేవంత్ కు భారీ దెబ్బగానే చెప్పవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి రానున్న రోజుల్లో ఇటువంటి పరిణామాలను రేవంత్ ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్.

loader