తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్‌సింహను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లు కొట్టివేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు.. అభియోగాలపై విచారణ ప్రారంభించింది.

విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయ్‌సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనను ఏసీబీ కోర్టులో గురువారం హాజరుపరచనున్నారు.

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫన్‌సన్‌‌ను ప్రలోభాలకు గురి చేసిన ఆరోపణలతో అప్పటి టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహాలపై ఏసీబీ కోర్టు కేసు నమోదు చేసింది.

నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫన్‌సన్‌కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షల నగదును ఇస్తున్న వీడియోలు సైతం అప్పట్లో కలకలం సృష్టించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు ఈ బేరం ఆడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.