తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమం ఓ రెండేళ్ల చిన్నారి ప్రాణాలమీదికి తెచ్చింది.  కంటి పరీక్ష కోసం ఓ మహిళ క్యూలో నిల్చుని ఉండగా రెండేళ్ల వయసున్న ఆమె కూతురు ఆడుకుంటూ వెళ్లి కూల్ డ్రింక్ బాటిల్లో వున్న పురుగుల మందు తాగింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో బోడ వెంకటేశ్, పద్మలు దంపతులు నివసిస్తున్నారు. వీరికి రెండేళ్ల వయసున్న ఓ కూతురు ఉంది. అయితే పద్మ తన రెండేళ్ల కూతురుని తీసుకుని ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమానికి వెళ్లింది. ఈమెలాగే చాలా మంది తమ కళ్లను పరీక్షించుకోడానికి భారీగా తరలిరావడంతో వైద్య సిబ్బంది వారందరిని ఓ క్యూ పద్దతిలో నిలబెట్టారు. ఒకరి తర్వాత ఒకరికి పరీక్షలు నిర్వహించారు. ఈ క్యూలో నిల్చున్న పద్మ తన కూతురుని ఆడుకోడానికి కింద వదిలింది. 

ఈ క్రమంలో ఆడుకుంటున్న ఆ పాపకు ఓ తరగతి గదిలో కూల్ డ్రింక్ సీసా కనిపించింది. కానీ అందులో పురుగుల మందు ఉంది. ఈ విషయం తెలియని చిన్నారి అందులోని ద్రవాన్ని కూల్ డ్రింక్ అనుకుని తాగేసింది. దీంతో తీవ్ర అస్వస్థకు గురైన పాపను గుర్తించిన తల్లి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. డాక్టర్లు వైద్యం చేసి పాపను కాపాడారు.

ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల గదిలోకి ఈ పురుగుల మందు ఎలా వచ్చిందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.