రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అందులో ఒకరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాగా, మరొకరు ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసి ఉన్నారు.  అనారోగ్య కారణాలతోనే వారిద్దరూ ఓటు వేయలేకపోయారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో అందరూ జాగ్రత్తగా ఓటు వేయాలన్న తెలంగాణ సిఎం కెసిఆర్ టిఆర్ఎస్ లో ఒకరికి మాత్రం మినహాయింపునిచ్చారు. ఆయన ఓటు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు సిఎం. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వాకబు చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో సిఎం మాట్లాడారు.  చికిత్స పొందుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసుపత్రి నుంచి రావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి సూచించారు. చికిత్సకు అంతరాయం కలగడం శ్రేయస్కరం కాదని సిఎం చెప్పారు.  సిఎం సూచన మేరకు ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలనే యోచనను ఎమ్మెల్యే విరమించుకున్నారు.

మరో ఎమ్మెల్యే కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసి రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. ఆయన ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. వైద్యం నిమిత్తం ఆయన లండన్ లో ఉన్నందున ఓటింగ్ కు రాలేదని పార్టీ నేతలు తెలిపారు. అయితే ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో ముందుగా తటస్థంగా ఉండాలనుకున్నప్పటికీ చివరికి యుపిఎ అభ్యర్థి మీరా కుమార్ కు ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో  ఆపార్టీ సభ్యులు యుపిఎ అభ్యర్థికి ఓటు వేశారు.