తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర వైపునుండి తెలంగాణకు వస్తున్న ఓ కారును ఎదురుగా వేగంగా  వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు  టెకీలలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపనీలో పనిచేసే లక్ష్మీనారాయణ, రాజన్, కోమల్ సింగ్, విజయ్ కుమార్ మంచి స్నేహితులు. వీరంతా కలిసి వారాంతంలో సరదాగా గడపడానికి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీకి కారులో బయలుదేరారు. దైవదర్శనం అనంతరం తిరుగుపయనమైన వీరు ఇవాళ(సోమవారం) తెలంగాణ సరిహద్దుల్లోకి రాగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 

తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా  వస్తున్న ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ, రాజన్‌ లు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. విజయ్, కోమల్ లు తీవ్ర గాయాలపాలయ్యారు. 

రోడ్డు ప్రమాదంపై సమాచారం  అందుకున్న స్థానిక  పోలీసులు సంఘటనా స్ధలానికి  చేరుకుని గాయపడిన వారిని ముందుగా  దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను కూడా బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం  తరలించారు. ఈ  ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.