ఓ ఆర్టీసీ బస్సును వెనకాల నుంచి మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సమయంలో బస్సుల్లో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. 

ముందు బైక్ పై వెళ్తున్న వ్య‌క్తి అదుపుత‌ప్పి కింద ప‌డిపోవ‌డంతో ఓ ఆర్టీసీ బ‌స్సు (Rtc bus) డ్రైవ‌ర్ అత‌డిని కాపాడేందుకు బ్రేకులు వేశారు. అయితే వెన‌కాలే వేగంగా వ‌స్తున్న మ‌రో ఆర్టీసీ బ‌స్సు ఒక్క సారిగా కంట్రోల్ కాక‌పోవ‌డంతో ముందున్న బ‌స్సును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో రెండు బ‌స్సుల్లో ఉన్న ప్ర‌యాణికులకు గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఓ ఆర్టీసీ బ‌స్సు నిర్మ‌ల్ (nirmal) నుంచి జగిత్యాల (jagityal) వెళ్తోంది. అయితే ఈ బ‌స్సుకు ముందు భాగంలో ఇద్ద‌రు యువ‌కులు బైక్ ల‌ను తీసుకొని వెళ్తున్నారు. ఒక బైక్ చెడిపోవ‌డంతో దానికి తాడు క‌ట్టి మ‌రో బైక్ సాయంతో ప్ర‌యాణం కొన‌సాగిస్తున్నారు. అయితే ఖానాపూర్ (kanapur) సిటీ ఔట్ క‌ట్స్ లో ని కుమురం భీం చౌర‌స్తా (kumuram bhim chourasta) వ‌ద్ద‌కు చేరుకోగానే ఓ యువ‌కుడు న‌డుపుతున్న బైక్ అదుపుత‌ప్పింది. దీంతో అత‌డు కింద ప‌డిపోయాడు. దీనిని గ‌మ‌నించిన డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌మై, ఆ యువ‌కుడిని కాపాడేందుకు బ‌స్సును నిలిపివేశారు. అయితే ఇదే స‌మ‌యంలో వెన‌కాలే నిర్మ‌ల్ నుంచి ఖానాపూర్ వ‌స్తున్న ఓ ఆర్టీసీ బ‌స్సు వేగంగా వ‌చ్చి ఈ బ‌స్సును వెన‌కాల నుంచి ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదం జరిగిన స‌మ‌యంలో బ‌స్సులో మొత్తం 177 మంది ఉన్నారు. ఒక్క సారిగా ఒక ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో బ‌స్సుల్లో ఉన్న 30 మంది గాయ‌ప‌డ్డారు. అదృష్ట‌వశాత్తు ఎక్కువ మందికి గాయాలు కాలేదు. 

ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారంద‌రినీ అందుబాటులో ఉన్న ప్రైవేట్ వాహ‌నాలు, 108 ఆంబులెన్స్ లు, ఆటోల ద్వారా ఖ‌నాపూర్ లో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం వారంతా అక్క‌డ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండ‌గా..డిసెంబ‌ర్ 16వ తేదీన ఇదే జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. నిర్మ‌ల్ నుంచి ఓ బ‌స్సు.. కామ‌ల్ వెళ్లి వ‌స్తోంది. మామ‌డ మండ‌లం ఆద‌ర్శ‌న‌గ‌ర్ వ‌ద్ద‌కు చేరుకోగానే అదుపుత‌ప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బ‌స్పు వేగంగా ఉండ‌టంతో దానిని అదుపు చేయ‌డం చాలా డ్రైవర్ కు చాలా కష్టతరమైంది. అయినా డ్రైవ‌ర్ కొంత స‌మ‌య‌స్ఫూర్తి ఉప‌యోగించి బ‌స్సు ను కంట్రోల్ చేశాడు. లేక‌పోతే పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగి ఉండేది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 60 మందికి వ‌ర‌కు ఉన్నారు. అందులో ఉన్న ప్ర‌యాణికుల్లో ప‌లువురికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. తృటిలో ప్ర‌మాదం తప్ప‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.