నల్గొండ జిల్లా చందంపేటలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బంధువులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. దేవరకొండ మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన ఎదుళ్ల వెంకట్, డిండి మండలం ఎర్రారం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మీ వివాహం గురువారం ఎర్రారం గ్రామంలో జరిగింది.

పెళ్లి వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న కంభాలపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ, నేరెడుగొమ్ము మండలం పేర్వాల గ్రామానికి చెందిన దారముల రామస్వామి, కంభాలపల్లికే చెందిన ఆనందం బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు.

అయితే వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం చందంపేట మండలం గన్నెరపల్లి మూలమలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో రామకృష్ణ, రామస్వామి దుర్మరణం పాలవ్వగా.. ఆనందం పరిస్ధితి విషమంగా ఉంది. వీరి మరణవార్తను తెలుసుకున్న బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.