హైదరాబాద్: కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు ఆరేళ్ల బాలుడిని రక్షించారు. పహడీ షరీఫ్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ సభ్యులు ఇద్దరు కిడ్నాపర్లను అరెస్టు చేసి, బాలుడ్ని కాపాడారు. షేక్ అహ్మద్, ఫియాజ్ అలీ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... శంషాబాద్ కు చెందిన మహిళ సోనీ ఈ నెల 3వ తేదీన చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. తన తల్లి సునీతతో పాటు తాను షేక్ అహ్మద్ ఇంటికి వెళ్లామని, తెల్లవారు జామున తాము లేచి చూసేసరికి తన కుమారుడు సాయి కనిపించలేదని, బయటి నుంచి ఇంటి తలుపులు మూసివేశారని ఆమె పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పిల్లాడి కోసం తాము గాలించామని, అయితే ఫలితం దక్కలేదని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

నిందితుల్లో ఒక్కడైన షేక్ అహమ్మద్ (28) పహడీ షరీఫ్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతను మహారాష్ట్రలోని నాందేడ్ లో గల న్యూ ముజంపేటకు చెందినవాడు. రెండో నిందితుడు ఫయాజ్ అలీ (39) రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ షహీన్ నగర్ సాదత్ నగర్ కు చెందినవాడు. 

షేక్ అహ్మద్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతన్ని నాందేడ్ లో పట్టుకున్నారు. ఆరేళ్ల సాయిని తాను మీర్ ఫయాజ్ కు అమ్మినట్లు అతను విచారణలో అంగీకరించాడు. 

దివ్యాంగుడైన షేక్ అహ్మద్ నాందేడ్ నుంచి 2014లో బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. అతనికి సాయి తల్లితో పరిచయం ఉంది. దాంతో ఆమె అతని ఇంటికి వచ్చిపోతూ ఉండేది. ఈ నెల 3వ తేదీన వచ్చినప్పుడు పథకం ప్రకారం సాయిని అతను కిడ్నాప్ చేశాడు. అతన్ని రూ. 10 వేలకు ఫయాజ్ కు అమ్మి నాదేండ్ పారిపోయాడు. 

"