తెలంగాణలో భూఆక్రమణలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలియజేసే సంఘటన రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఐటీ పరిశ్రమలు, ధనవంతుల నివాసాలకు నిలయమైన గచ్చిబౌలి ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని  కొట్టేయడానికి కొందర భూబకాసురులు స్కెచ్ వేశారు. ఇందుకోసం  ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 

గచ్చిబౌలి ప్రాంతంలో  ఖాళీగా వున్న 2 ఎకరాల భూమిపై కొందరు వ్యక్తుల కన్ను పడింది. దాన్ని ఎలాగైనా కాజేయాలని భావించి ఓ టీఆర్ఎస్ నాయకుడితో కుమ్మక్కయ్యారు. అతడికి   రూ.45  వేల నగదు చెల్లించి లెటర్ హెడ్ ను కొనుగోలు చేశారు. దానిపై ఆ  రెండెకరాలు భూమి లెగ్యులరైజ్ చేయాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్ని పోర్జరీ చేసి లెటర్ హెడ్ ను రెవెన్యూ శాఖకు పంపారు. 

అయితే ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన రాజేంద్రనగర్ ఆర్డీవో  పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి ఈ వ్యవహారానికి  సంబంధించిన వివరాలను రాబట్టారు. ఈ కేసుతో సంబంధమున్న మరో వ్యక్తి  ప్రస్తుతం పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. మరింత లోతుగా విచారణ జరిపి ఇంకా ఎవరికైనా  ఈ వ్యవహారంతో సంబంధముంటే వారిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు రాయదుర్గం పోలీసులు వెల్లడించారు.