వరంగల్ లో బీజేపీ నేతలు చేపట్టిన ధర్నాలో అపశృతి చోటుచేసుకుంది. ఇటీవల 9నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే యువకుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ నేతలు ఆధర్నా కార్యక్రమం చేపట్టారు.

ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ... ఆయన  దిష్టిబొమ్మ తగలపెట్టారు. దిష్టిబొమ్మకు నిప్పంటించినప్పుడు అక్కడకు వచ్చిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. తోపులాటకు దారితీసింది. 

అదే సమయంలో దిష్టిబొమ్మకు నిప్పంటిస్తున్న శ్రీనవాస్ అనే కార్యకర్తపై కిరోసిన్ పడి నిప్పంటుకుంది. అలాగే అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ చేతికి నిప్పంటుకుని గాయాలు అయ్యాయి. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. మరో మహిళ కార్యకర్త చీరకు నిప్పంటుకోవడంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. కాగా తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం.