Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు.. వెల్లడించిన డీహెచ్ శ్రీనివాస్ రావు

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా తెలంగాణలో కూడా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు (Omicron cases In Telangana) నమోదయ్యాయి. ఈ వివరాలను తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు బుధవారం మీడియాకు వెల్లడించారు. 

two omicron cases reported in telangana says DH Srinivas Rao
Author
Hyderabad, First Published Dec 15, 2021, 11:18 AM IST

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా తెలంగాణలో కూడా తొలిసారిగా ఒమిక్రాన్ బయటపడింది. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు (Omicron cases In Telangana) నమోదయ్యాయి. ఈ వివరాలను తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు బుధవారం మీడియాకు వెల్లడించారు. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టుగా తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు నిన్న రాత్రి వచ్చినట్టుగా చెప్పారు. అందులో ఒకరు 24 ఏళ్ల మహిళని.. ఆమె కెన్యానుంచి ఈ నెల 12న తెలంగాణకు వచ్చారని చెప్పారు. ఆ యువతి టోలిచౌకిలో ఉన్నట్టు గుర్తించామన్నారు. ఆమె ఇంట్లోని ఇద్దరిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారని తెలిపారు. వారి శాంపిల్స్‌ను ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కు పంపించినట్టుగా వెల్లడించారు. యువతిని ప్రస్తుతం గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించినట్టుగా చెప్పారు. 

రెండో వ్యక్తి సోమాలియా నుంచి వచ్చిన 23 ఏళ్ల వ్యక్తి అని  శ్రీనివాస్ రావు తెలిపారు. నాన్ రిస్క్‌ కంట్రీ నుంచి రావడంతో.. పరీక్షలు నిర్వహించి ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లేందుకు అనుమతించినట్టుగా తెలిపారు. ఇతను కూడా టోలిచౌకి ప్రాంతంలో ఉంటున్నట్టుగా చెప్పారు. అతన్ని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. మరోకరికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయిందని.. అతడు 7 ఏళ్ల బాలుడని తెలిపారు. బాలుడి స్వస్థలం బెంగాల్‌ అని.. రాష్ట్రంలోకి రాలేదని వెల్లడించారు. అతడు విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి.. కోల్‌కతాకు వెళ్లినట్టుగా చెప్పారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ వైద్యారోగ్య శాఖకు తెలియజేయడం జరిగిందని చెప్పారు. బాధితుల్లో పెద్దగా లక్షణాలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ, హైదరాబాద్‌లోని స్థానికులకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు ఉన్నట్టుగా వెల్లడించారు. 

Also read: Omicron Scare: కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆరుగురు.. ఆ సంకేతాలతో ఒమిక్రాన్ టెన్షన్..

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాస్ రావ్ సూచించారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకన్న సరే అప్రమత్తత అవసరం అని సూచించారు. కోవిడ్ సమయంలో ఎలాంటి నియమాలు పాటించామో.. ఇప్పుడు కూడా అదే విధంగా పాటించాలని చెప్పారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఒమిక్రాన్ సోకిన వ్యక్తి పారిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఒమిక్రాన్ కూడా గాలి ద్వారానే సోకుతుందని చెప్పారు. పండుగలు, ఫంక్షన్‌లు కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారని తెలిపారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. ఇక, తెలంగాణలో రెండు కేసులతో కలిపి భారత్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 59కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios