Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం... ముంబై వాసులిద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముంబైకి చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. 

two killed and three injured in hyderabad orr accident
Author
Hyderabad, First Published Jun 29, 2022, 11:14 AM IST

హైదరాబాద్ : మెరుగైన రవాణా సదుపాయం కోసం తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు (hyderabad orr) పై ప్రమాదాలు పెరిగిపోయాయి. మంచి విశాలమైన రోడ్డు కావడంతో వాహనదారులు అతివేగంతో వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాగే మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం నుండి కారులో హైదరాబాద్ వస్తున్నవారు మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరతారనగా ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

కీసర పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన సత్తార్ మన్నేర్, జైద్ మొమైన్, వసీమ్ మొమైన్, మోడీస్ లు డ్రైవర్ నియాజ్ ను తీసుకుని కారులో హైదరాబాద్ కు బయలుదేరారు. మరికొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరతారనగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా కీసర సమీపంలోని యాద్గార్ పల్లి వద్దకు రాగానే కారు అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లి కల్వర్టును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో డ్రైవర్ నియాజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డవారిని దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వసీమ్ మొమైన్ మృతిచెందాడు. మిగతా ముగ్గురు చికిత్స పొందుతున్నారు. 

ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమయి వుంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 

ఇదిలావుంటే నిజామాబాద్ జిల్లా వేల్పూరు క్రాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. వేగంగా దూసుకోచ్చిన కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో వెంటనే కారులో మంటలు చెలరేగి కారుమొత్తాన్ని వ్యాపించాయి. దీంతో కారులో చిక్కుకుపోయిన ఇద్దరు సజీవ దహనమయ్యారు. మృతులిద్దరు జగిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.  

కాగా జూన్ 24న ఏలూరులో ఇద్దరు వ్యక్తులు ఇలాగే సజీవ దహనం అయ్యారు. వీరిద్దరూ అన్నాదమ్ములే. విద్యుత్ షాక్ గురయి ఒకేసారి దుర్మరణం చెందడం ఏలూరు జిల్లాలో న విషాదాన్ని నింపింది.  ఒకేసారి ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరి మృతుకి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

జంగారెడ్డి గూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన వల్లేపల్లి నాగేంద్ర, ఫణీంద్ర సోదరులు. పెద్దోడు బిటెక్, చిన్నవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు. ఇటీవల తండ్రికి అనారోగ్యం చేసింద. దీంతో నాగేంద్ర, ఫణీంద్ర ఇద్దరూ ఆ రోజు తెల్లవారుజామున పాలు పితకడానికి పొలానికి వెడుతున్నారు. ఆ సమయంలో ఈ ఘోరం జరిగింది. రాత్రి ఎప్పుడో 11 కేవీ విద్యుత్ వైర్లు తెగి రహదారిపై పడ్డాయి. గ్రామస్తులు కానీ, విద్యుత్ శాఖ అధికారులు గానీ ఇది గమనించలేదు. దీంతో అన్నాదమ్ములు బైక్ మీద వెళుతుండగా విద్యుత్ సరఫరా అవుతున్న తీగలు తగిలాయి. దీంతో ఒక్కసారిగా బైక్ కు మంటలు అంటుకున్నాయి. అది గమనించేలోపే.. రెప్పపాటులో సోదరులిద్దరికీ మంటలు వ్యాపించాయి. వారు తేరుకుని బండి దిగే లోపే  ఇద్దరు యువకులు సజీవ దహనం అయి.. అక్కడికక్కడే దుర్మరణం చెందారు.   

Follow Us:
Download App:
  • android
  • ios