వైరా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, బాణాసంచా పేలుడు: ఇద్దరు మృతి
ఖమ్మం కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో సిలిండర్ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో చికిత్స పొందుతూ బానోతు రమేష్, ఆంగోతు మంగు మృతి చెందారు.
ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళంనం నిర్వహించారు. ఈ సమ్మేళనం నిర్వహిస్తున్న సమయంలో బాణాసంచా పేల్చడంతో నిప్పు రవ్వలు ఎగిరి పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసెకు నిప్పు అంటుకుంది. ఈ గుడిసెలో ఉన్న ఎల్పీజీ సిలిండరు పేలింది.
గుడిసెకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు పోలీసులు , స్థానికులు వెళ్లారు. అయితే అదే సమయంలో గుడిసెలో ఉన్న సిలిండర్ పేలింది. ఈ పేలుడులో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
ఈ పేలుడు ఘటన సమయంలో పలువురు కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. ఈ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మెరుగై న చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలిస్తామని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు. ఈ ఘటనలో పోలీసులు , జర్నలిస్టులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడినవారిలో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.