హైదరాబాద్ బాలానగర్ జర్నలిస్టుల నిర్వాకం ఎస్ ఓటి పోలీసులమంటూ వసూళ్లు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు జర్నలిస్టుల దినోత్సవం వేళ రిమాండ్
దేశంలోని జర్నలిస్టులంతా బుధవారం నాడు జర్నలిస్టుల దినోత్సవాన్ని జరుకున్నారు. అయినా బెంగళూరు మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ దారుణ హత్య నేపథ్యంలో బాధతోనే ఆ జర్నలిస్టుల దినోత్సవాలు జరిగాయి. నిరసనలు జరిగాయి. జర్నలిస్టుల దినోత్సవానికి ఒకరోజు ముందు ఆమెను హత్య చేశారు.
ఇక హైదరాబాద్ లో జర్నలిస్టుల దినోత్సవం వేళ ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారిని ఎందుకు అరెస్టు చేశారంటే వాళ్లు చేసిన నిర్వాకం ఏంటో చదవండి. హైదరాబాద్ జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలివి.
సౌభాగ్యనగర్ నివాసి ఎస్.డి.ఆరిఫ్(27) టీఎన్‌ఎన్ ఛానల్‌లో, ఎం.డి.జావిద్(36) క్రైం టుడే ఛానల్‌లో బాలానగర్ విలేకరులుగా పనిచేస్తున్నారు. ఇరువురు గురుమూర్తినగర్ నివాసి వెల్డర్‌గా పనిచేస్తున్న మోసిన్(28)తో కలిసి చింతల్ భగత్‌సింగ్‌నగర్‌లో మద్యం బెల్టుషాపులు నిర్వహిస్తున్న కుమారస్వామి ఇంటికి ఈనెల 5న రాత్రి 11 గంటలకు వెళ్లి మద్యం కావాలని అడిగారు.
మద్యం సీసా ఇవ్వగానే కల్లు డబ్బాలు, మద్యం సీసాల చిత్రాలు, వీడియోలు తీసి తాము ఎస్‌వోటీ పోలీసులమని చెప్పి, డబ్బు ఇవ్వకపోతే కేసు నమోదు చేయాల్సి వస్తుందని బెదిరించారు. భయపడిన అతడు రూ.1300 ఇచ్చిన తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేసేలోపే ముగ్గురూ పరారయ్యారు.
ఈ మేరకు కుమారస్వామి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురిని అరెస్టు చేసి అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం, బెదిరింపు, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
