హైదరాబాద్ నీలోఫర్‌లో కలకలం.. న్యుమోనియాతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్
న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిన తర్వాత ముందుజాగ్రత్త పరీక్షలో గురువారం హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌లో ఇద్దరు పిల్లలు (ఒకరు 2 నెలల బాలిక, 14 నెలల బాలుడు) కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన నెల రోజుల కాలంలో కేసుల సంఖ్య 52 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 8.50 లక్షల కేసులు నమోదయ్యాయని.. వీరిలో 1.18 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారని వెల్లడించింది. భారత్‌లో కేసులు కూడా నానాటికీ పెరుగుతున్నాయి. జేఎన్.1 వేరియంట్ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇకపోతే.. న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిన తర్వాత ముందుజాగ్రత్త పరీక్షలో గురువారం హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌లో ఇద్దరు పిల్లలు (ఒకరు 2 నెలల బాలిక, 14 నెలల బాలుడు) కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు.
ఆసుపత్రిలో చేరిన చిన్నారులకు సామూహికంగా కరోనా టెస్టులు నిర్వహించాలని నిలోఫర్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గురువారం నీలోఫర్ హాస్పిటల్‌లో చేరిన 2 నెలల బాలిక , 14 నెలల బాలుడికి కోవిడ్ 19 పాజిటివ్ తేలింది. బాలికకు హై ఫ్లో నాసల్ కాన్యులా (హెచ్ఎఫ్ఎన్‌సీ) చికిత్స అందించగా బాలుడి పరిస్థితి నిలకడగా వుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇద్దరు చిన్నారులు దగ్గు, శ్వాస సమస్యలతో సహా న్యుమోనియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. వారికి ముందు జాగ్రత్తగా కోవిడ్ 19 టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.
న్యుమోనియా , ఇతర శ్వాసకోశ వ్యాధులతో చేరిన పిల్లలందరికీ ముందు జాగ్రత్త చర్యగా కరోనా పరీక్షలు నిర్వహించాలని నీలోఫర్ ఆసుపత్రిలోని వైద్యులు నిర్ణయించారని అధికారి చెప్పారు. వీరిని క్వారంటైన్‌లో వుంచారని.. ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్న 83 మంది చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చిన్నారులు, వృద్దుల్లో న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక ఏడాది లోపు పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతున్నారని నిపుణులు అంటున్నారు.
వ్యాధి బారినపడకుండా జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు సూచించినప్పటికీ వైరల్ న్యుమోనియా 3 నుంచి 4 వారాల్లో తగ్గిపోతుంది. న్యుమోనియా సాధారణంగా రెండేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంటిలేటర్‌లో ఎక్కువ కాలం ఐసీయూలో వున్నవారిని ప్రభావితం చేస్తుందని నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. కోవిడ్‌తో పాటు న్యుమోనియా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1తో ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా వుండాలని వైద్యులు సూచించారు. ఆస్తమా, క్రానిక్ అబ్ర్టక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ), గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపరితిత్తులు వ్యాధులు, ధూమపానం చేసేవారు, హెచ్‌ఐవీ, క్యాన్సర్ బాధితులు, అవయవ మార్పిడి చేసుకున్నవారు జాగ్రత్తగా వుండాలని సూచించారు. తీవ్రమైన జ్వరం, ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వుంటే వెంటనే దగ్గరిలోని వైద్యులను సంప్రదించాలని చెప్పారు. దగ్గు, చలి, వణుకుతో కూడిన జ్వరం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సాధారణ అలసట, వికారం, వాంతులు, విరేచనాలు న్యుమోనియా లక్షణాలని డాక్టర్లు వెల్లడించారు.