Asianet News TeluguAsianet News Telugu

పదో తరగతి చదివి.. 25యేళ్లుగా డాక్టర్లుగా చలామణి.. ఇద్దరి అరెస్ట్...

పదో తరగతి వరకే చదువుకుని, డాక్లర్ వద్ద పనిచేసిన అనుభవంతో స్వయంగా డాక్లర్ అవతారమెత్తారు ఇద్దరు దోస్తులు. చెరో క్లినిక్ పెట్టుకుని 25యేళ్లుగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. 

two fake doctors arrested in warangal
Author
First Published Sep 28, 2022, 2:31 PM IST

వరంగల్ : చదివింది పదో తరగతి. అందులోనూ ఒకరు ఫెయిల్ అయితే.. మరొకరు పాసయ్యారు. వారు ఇద్దరు స్నేహితులు. డాక్టర్ల వద్ద పనిచేసిన అనుభవం ఉంది. డబ్బులపై ఆత్యాశ ఉంది. దీంతో డాక్టర్ల అవతారమెత్తారు. అందుకు అవసరమయ్యే సర్టిఫికెట్లను కొనుగోలు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 25 ఏళ్లుగా నగరంలో డాక్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరు నకిలీల భాగోతం ఎట్టకేలకు బయటపడింది. నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు.

నకిలీ డాక్టర్ల నుంచి  రూ.1.28లక్షలు నగదు, ఆసుపత్రి పరికరాలు,  మందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం కమిషనరేట్లో నిందితుల వివరాలు వెల్లడించారు. హంటర్ రోడ్డు ప్రాంతానికి చెందిన ఇమ్మడి కుమార్ పదో తరగతి పూర్తి చేయగా,  వరంగల్ చార్ బౌళి ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ  పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. ఇద్దరు మిత్రులు కావడంతో 1997 సంవత్సరానికి ముందు ప్రముఖ డాక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. డబ్బులు బాగా సంపాదించాలనే ఆలోచనతో..  బీహార్ రాష్ట్రంలోని దేవఘర్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం నుంచి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్ తోపాటు గుర్తింపు కార్డులను కొనుగోలు చేశారు. 

మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు: షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

కుమార్.. క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో దుకాణం తెరిచాడు. రఫీ..  సలీమా క్లినిక్ పేరుతో చార్ భౌళి ప్రాంతంలో 25 ఏళ్లుగా ఆస్పత్రి నడిపిస్తున్నాడు. సాధారణ రోగాలతో వచ్చే వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవారు. రోగం ముదిరి లోపే కార్పొరేట్ ఆస్పత్రులకు పంపేవారు. చివరికి నకిలీ డాక్టర్ల వ్యవహారం బయటకు తెలియడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసులు వరంగల్ రీజినల్ విభాగం ఆధ్వర్యంలో రెండు ఆస్పత్రులపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించారు. నకిలీ డాక్టర్లను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్, పోలీసులను సిపీ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios