వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టిస్తోంది. కల్తీ కల్లుకు ఇద్దరు బలయ్యారు. సుమారు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైనవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకొంది. కల్తీకల్లు తాగి ఇద్దరు  మరణించారు. అస్వస్థతకు గురైనవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో  కూడ గతంలో కల్తీకల్లుకు అస్వస్థతకు గురైన ఘటనలు అనేకం ఉన్నాయి. అస్వస్థతకు గురికావడంతో పాటు మరణించిన ఘటనలు కూడ పాలమూరు జిల్లాలో గతంలో చోటు చేసుకొన్నాయి.

వికారాబాద్ జిల్లాలో కూడ ఇదే రకమై ఘటన చోటు చేసుకొంది.  కల్తీకల్లు బారిన పడినవారికి ఫిట్స్ లక్షణాలు ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు.

తొలుత ఒకే మండలంలో అస్వస్థతకు గురైనట్టుగా రిపోర్టులు వచ్చాయి. ఆ తర్వాత ఇదే జిల్లాలోని మరో మండలంలో కూడ  ఇదే తరహా కేసులు వెలుగు చూశాయి. ఈ రెండు మండలాల్లో 11 గ్రామాల్లో బాధితులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ పౌసుమి బాస్ ఘటన గురించి ఆరా తీశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. సీరియస్ గా ఉన్నవారిని హైద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు.శనివారం నాడు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని స్థానికులు చెప్పారు.