జనగామ: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

లింగాల ఘనపురం మండలం చిటూరు వద్ద ప్రమాదం సంభవించింది. మంత్రి హైదరాబాదు నుంచి పాలకుర్తి వెళ్తుండగా ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ పార్థసారథితో పాటు సోషల్ మీడియా ఇంచార్జీ పూర్ణ మరణించారు. 

శనివారం రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాదు నుంచి పాలకుర్తి బయలుదేరారు. జనగామ జిల్లా కేంద్రం వరకు కాన్వాయ్ లోని వాహనాలన్నీ కలిసే వచ్చాయి. మంత్రితో ఉన్న కాన్వాయ్ వెళ్లిపోగా, అందులోని ఒక వాహనం మధ్యలో కాసేపు ఆగి బయలుదేరింది. 

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చిటూరు శివారులో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ప్రమాదం జరిగిన సమాచారాన్ని అందుకున్న మతం్రి వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో అటెండర్ తాతారావు, వ్యక్తిగత పిఏ శివ, గన్ మన్ నరేష్ లు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాదు తరలించారు. 

పాలకుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ మంత్రివర్గంలో చేరారు. ఆయన పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు.