కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్‌లో రెండు జంటలు ఒకే రోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్ జిల్లా కే. సముద్రం ప్రాంతానికి చెందిన బండి మురళి వరంగల్ జిల్లా సంగెం ప్రాంతానికి చెందిన ప్రియాంకలకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.

మురళి హైదరాబాద్‌లో హర్డ్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వీరు ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్నారు. గత కొద్దిరోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం వారి మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో మనస్తాపానికి గురైన మురళి కోపంగా గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రియాంక కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే దీనిని గమనించిన స్థానికులు 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

అప్పటికే మురళీ మరణించగా..ప్రియాంక కొన ఊపిరితో ఉండటంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇక ఉత్తరాఖండ్‌కు చెందిన ప్యార్‌సింగ్ నేగీ, రేఖా దేవి దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చారు.

వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్యార్‌సింగ్ అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో‌ చెఫ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య కొద్దిరోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ప్యార్‌సింగ్ నిద్రలేచి చూసే సరికి మరో గదిలో రేఖాదేవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

భార్య లేని జీవితం వ్యర్థమని భావించి... అతను ఆమె చున్నీతో కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్రలేచిన పిల్లలు తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.