హైదరాబాద్‌ నారాయణగూడలో 10 రోజుల క్రితం జరిగిన పెట్రోల్ దాడి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో కడుపులో ఉన్న చిన్నారితో పాటు మొత్తం నాలుగు ప్రాణాలను బలికొంది.

హైదరాబాద్‌ నారాయణగూడలో 10 రోజుల క్రితం జరిగిన పెట్రోల్ దాడి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో కడుపులో ఉన్న చిన్నారితో పాటు మొత్తం నాలుగు ప్రాణాలను బలికొంది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు, అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఆర్తి, నాగులుసాయి కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు వైవాహిక జీవితం బాగానే సాగింది. ఆ తర్వాత దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగడంతో.. గొడవను సర్దిచెప్పేందుకు యత్నించిన ఆర్తి సోదరుడు జితేందర్‌పై నాగులుసాయి దాడి చేశాడు. జితేందర్‌పై ముషీరాబాద్‌లో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అయితే జితేందర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నాగులుసాయిను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

ఈ క్రమంలోనే నాగరాజు అనే మరో వ్యక్తిని ఆర్తి వివాహం చేసుకుంది. వీరికి పది నెలల బాబు విష్ణు ఉన్నాడు. ప్రస్తుతం ఆర్తి 5 నెలల గర్భంతో ఉంది. అయితే జైలు నుంచి విడుదలు సాయి.. ఆర్తి మరో వ్యక్తిని వివాహం చేసుకోవడంపై కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన నాగరాజు, ఆర్తి, విష్ణులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. 

తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలతో విష్ణు నవంబర్ 8న గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నాగరాజు నవంబర్ 11 న తుది శ్వాస విడిచాడు. ఇక, ఆర్తికి గర్భస్రావం జరిగి కడపులోని బిడ్డ కూడా చనిపోయింది. తాజాగా ఆర్తి కూడా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. 

ఈ ఘటనకు సంబంధించి సాయితో పాటు అతనికి సహకరించిన రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో హత్యలో తన పాత్ర ఉందని వారు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.