పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల్లో ట్విస్ట్.. వాటికి మాత్రమే డిస్కౌంట్ వర్తింపు..
Discounts on traffic challans : తెలంగాణలో పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం డిస్కౌంట్ ప్రకటించడంతో అందరూ వాటిని కట్టేందుకు ఎగపడుతున్నారు. అయితే కొందరికి ఫైన్లపై డిస్కౌంట్లు రావడం లేదు. ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు స్పష్టతను ఇచ్చారు.
Telangana traffic pending challans : తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ అవకాశం మంగళవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చింది. జనవరి 10వ తేదీ వరకు ఈ ఆఫర్ తో చలాన్లు కట్టేందుకు అవకాశం ఉంటుంది. బుధవారం ఉదయం నుంచి వాహనదారులు పెండింగ్ లో ఉన్న తమ చలాన్లు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి డిస్కౌంట్ వర్తించడం లేదు. ఎందుకిలా జరిగిందని ఆరా తీస్తే ఈ డిస్కౌంట్ అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు వర్తించవని తెలిసింది.
పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు కట్టేందుకు భారీ డిస్కౌంట్ ను ఇస్తున్నట్టు ఈ నెల 22వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణ రవాణా, రోడ్లు భవనాల శాఖ జీవో నంబర్ 659 ను 26వ తేదీన జారీ చేసింది. అంందులో 2024 జనవరి 10వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు వర్తిస్తాయని పేర్కొంది.
ఆ జీవో ప్రకారం టూ వీలర్లకు, ఆటోలకు 20 శాతం చలానా చెల్లిస్తే మిగిలిన 80 శాతం మాఫీ అవుతుంది. తోపుడు బండ్లు, చిరువ్యాపారులకు (39బీ కేసులు) 10 శాతం ట్రాఫిక్ చలానా చెల్లిస్తే మిగిలిన 90 శాతం మాఫీ అవుతుంది. తేలికపాటి మోటారు వాహనాలు (ఎల్ఎంవీలు), కార్లు, జీపులు, భారీ వాహనాలకు 40 శాతం చెల్లిస్తే మిగిలిన 60 శాతం మాఫీ అవుతుంది. ఆర్టీసీ డ్రైవర్లకు 10 శాతం ట్రాఫిక్ చలానా చెల్లిస్తే మిగిలిన 90 శాతం మాఫీ అవుతుంది.
అయితే తెలంగాణలో అన్ని రకాల వాహనాలకు చలాన్లపై డిస్కౌంట్లు వర్తిస్తాయి.. కానీ అవి ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు ఉన్న చలాన్లకు మాత్రమే వర్తిస్తాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఒక నెటిజన్ వేసిన ప్రశ్నకు హైదరాబాద్ పోలీస్ ‘ఎక్స్’లో సమాధానమిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
తనకు వాహనానికి ఉన్న ఫైన్లపై డిస్కౌంట్ వర్తించడం లేదంటూ ఆయన ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. అయితే దీనికి హైదరాబాద్ పోలీసులు సమాధానమిస్తూ.. 2023 నవంబర్ 30 కంటే ముందు ఉన్న పెండింగ్ చలాన్లకు మాత్రమే డిస్కౌంట్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. దీనిని బట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వాహనాలపై పడిన ఫైన్లకు డిస్కౌంట్ లేదని స్పష్టమవుతోంది.