హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ లో జరిగిన దంత వైద్యుడు హుస్సేన్ కిడ్నాప్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. డబ్బుల కోసం అతని బంధువు ముస్తఫా అతన్ని కిడ్నాప్ చేయించినట్లు తేలింది. డాక్టర్ ఇంట్లో అద్దెకు ఉండే ఖలీద్ ను విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.  

హుస్సేన్ బ్యాంక్ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని ముస్తపా కనిపెట్టాడు. ఖలీద్ ద్వారా ముస్తాఫ్ కిడ్నాప్ నకు పథకం రచన చేశారు. మూడు నెలల పాటు ప్లాన్ వేసినట్లు తేలింది. హుస్సేన్ ను కిడ్నాప్ చేసిన తర్వాత అతని భార్యకు ఫోన్ చేసి బిట్ కాయిన్ రూపంలో రూ.10 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. 

ఖలీద్, ముస్తఫా బిట్ కాయిన్ వ్యాపారం చేస్తారని పోలీసులు తెలుసుకున్నారు. వారికి బెంగుళూరులో హోటల్ వ్యాపారం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొబైల్ నెంబర్ ఆధారంగా వెహకిల్ ను ట్రేస్ చేసిన సైబరాబాద్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అనంతపురం జిల్లా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించారు. 

అనంతపురం జిల్లా తపోవనం వద్ద ఓ వాహనం ఆగకుండా వేగంగా వెళ్తుండడాన్ని గమనించిన పోలీసులు దాన్ని వెంబడించారు. రాప్తాడు మండలం బుక్కచర్ల వద్ద పోలీసులు దాన్ని అడ్డుకోగలిగారు. డాక్టర్ ను రక్షించారు. మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మంగళవారం రాత్రి అయినా హుస్సేన్ రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్లు అనంతపురం మీదుగా వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబుకు సమాచారం ఇచ్చారు. దాంతో ఎస్పీ ఆదేశాలతో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.