హైదరాబాద్: సూర్య వేధింపుల వల్లే టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని  పోలీసులు తేల్చారు.సూర్యతో తన లవ్ ఎఫైర్ గురించి ఝాన్సీ ఓ డైరీలో రాసుకొంది. ఝాన్సీ ప్రియుడు సూర్యను ఆదివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

బుల్లి తెర నటి ఝాన్సీని ఆమె ప్రియుడు సూర్య వేధింపులకు గురి చేయడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని  పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరిద్దరూ కూడ కొంత కాలం పాటు సహ జీవనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

పెళ్లి చేసుకొంటామని కూడ రెండు కుటుంబాలకు కూడ చెప్పినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. ఇప్పటికే ఝాన్సీకి చెందిన రెండు సెల్‌పోన్‌లను సీజ్ చేశారు. ఈ ఫోన్లలో ఉన్న వీడియోలను, వాట్సాప్ చాటింగ్‌లపై కూడ పోలీసులు దర్యాప్తు చేశారు.

ఝాన్సీ రాసుకొన్న డైరీని కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ డైరీలో ఝాన్సీ రాసుకొన్న విషయాలు పోలీసుల దర్యాప్తుకు ఉపయోగపడ్డాయి. సూర్య లేకుండా తాను జీవించలేనని ఆమె డైరీలో రాసుకొంది. మరో వ్యక్తితో  ఝాన్సీ చనువుగా ఉంటుందనే నెపంతో సూర్య ఆమెను అనుమానించడం మొదలుపెట్టినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.

ఝాన్సీ మీద సూర్య ఆంక్షలు పెరిగిపోయాయని కూడ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.. ఝాన్సీ డ్రెస్‌ల మీద కూడ ఆంక్షలు విధించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.  బయటకు వెళ్లకూడదని కూడ ఆమెపై నిర్భంధం విధించినట్టు కుటుంబస్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఝాన్సీ తన ప్రియుడు సూర్యకు 14 మేసేజ్‌లు వాట్సాప్ ద్వారా పంపింది. కానీ,  ఆ వాట్సాప్‌లను సూర్య చూడలేదు. అంతేకాదు సూర్యకు ఆమె ఫోన్ చేసినా కూడ అతను ఫోన్  తీయలేదు.  ఈ పరిణామాల నేపథ్యంలో  ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని  పోలీసులు  అభిప్రాయపడుతున్నారు.

ఝాన్సీ ఆత్మహత్యకు  ఆమె ప్రియుడు సూర్య కారణమని  కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆదివారం నాడు పోలీసులు  సూర్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.