హైదరాబాద్: జల్సాలకు మరిగి చోరీలకు దిగిన టీవీ యాక్టర్ ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని చైతన్యపురి, సరూర్ నగర్ పోలీసు స్టేషన్ల పరిధుల్లో రెండేళ్లలో 16 దొంగతనాలు చేశాడు. చైతన్యపురి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 

రాచకొండ పోలీసు కమిషన్ మహేష్ ఎం. భగవత్ అందుకు సంబంధించిన వివరాలను అందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం లక్కారం రోడ్డు ప్రాంతానికి చెందిన బారి నాగరాజు (23) అలియాస్ నరేందర్ అలియాస్ గుంటూరు నరేంద్ర డిగ్రీ మధ్యలో ఆపేసి సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేశాడు. 

వివాహమైన తర్వాత ఉపాధి కోసం 2016లో హైదరాబాదు వచ్చాడు. ఫ్యాషన్, సినీ రంగాలపై ఆసక్తి కారణంగా కొంత కాలం కొన్ని స్టూడియోల్లో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు. ఓ కామెడీ టీవీ షోలో కూడా నటించాడు. 

మద్యానికి, పొగ తాగడానికి బానిసయ్యాడు. డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలకు దిగాడు. 2014-15 మధ్య కాలంలో హుజూర్ నగర్ లో నాలుగు బైకులను దొంగిలించాడు. ఆ తర్వాత రెండేళ్లలో 16 చోరీలు చేశాడు. 

ఎవరికీ అనుమానం రాకుండా తాను దొంగిలించిన నగలను గోల్డ్ లోన్ సంస్థల్లోని వివిధ శాఖల్లో తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నాడు. కొన్ని ఆభరణాలను వివిధ ప్రాంతాల్లో విక్రయించాడు.