తెలంగాణ లో ప్రతిపక్ష పార్టీల నుండి అధికార టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్,టిడిపి ల నుండి పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరారు. తాజాగా వారి బాటలోనే రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి కూడా టిడిపికి ఝలక్ ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఆమె సైకిల్ దిగి కారెక్కడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. 

రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్న శోభారాణి ఇటీవల తెలుగు దేశం జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడిని కలిసి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ కేడర్ బలంగా వున్న ఉమ్మడి జల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల్లో టిడిపి అభ్యర్థులను బరిలోకి దించితే బావుంటుందని సూచించారు. అయితే అధినేత ఆమె మాటలను పరిగణలోకి తీసుకోకపోవడంతో శోభారాణి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. దీంతో ఇక టిడిపిలో భవిష్యత్ లేదని భావించిన ఆమె మిగతా నాయకుల మాదిరిగానే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఆమె టీఆర్ఎస్ పార్టీ పెద్దలతో టచ్ లో వున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ లో చేరికపై వారితో పలు దఫాలు చర్చలు కూడా జరిపినట్లు....త్వరలోనే టిడిపికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరడానికి అన్నివిధాలుగా సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే  అధికారికంగా మాత్రం ఆమె నుండి ఇంకా టిడిపిని వీడనున్నట్లు ప్రకటన వెలువడలేదు. 

ఇప్పటికే టిడిపి నుండి ఎమ్మెల్యే సండ్ర వెంకట  వీరయ్య, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు  టిడిపిని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఇంచుమించు టిడిపి ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన కొందమంది నాయకులు టిడిపి ని వీడి ఇతర పార్టీల బాట పడుతున్నారు. ఇలా శోభారాణి కూడా గులాబీ కండువా కప్పుకోడానికి సిద్దమయ్యారు.