టీఆర్ఎస్ పార్టీ నేతలు కావాలనే తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ ఆరోపించారు. తాము ఏళ్ల తరబడి ఎన్నో ఎన్నికలు ఎదుర్కొన్నామని..ఎప్పుడూ నియమావళి ఉల్లంగించలేదని ఆయన పేర్కొన్నారు.అయినా కూటమి నేతలు, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం భయబ్రాంతులకు గురిచేస్తుందని  ఎల్ రమణ అన్నారు. 

గురువారం ప్రజా కూటమి నేతలు ఎల్. రమణ, వి.హనుమంతరావు, జంధ్యాల రవి శంకర్, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు సీఈఓ రజత్ కుమార్ ను కలిసారు. ప్రజా కూటమి నేతల ఇళ్లపై పోలీసులు ఏకపక్షంగా సోదాలు చేయడంపై ఫిర్యాదు చేశారు. 

అనంతరం రమణ మాట్లాడుతూ... ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ, సొంత మీడియా వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నేతలు భారీగా అక్రమాలకు పాల్పడుతుతూ.. ప్రత్యర్థులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు సీఈవోకు ఇచ్చామని ఆయన తెలిపారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. 108, 104, మీడియా వాహనాల్లో డబ్బు, మద్యం తరలిస్తున్నారు.. మధిరలో వాహనాలు పట్టుబడటమే అందుకు నిదర్శనమని రమణ పేర్కొన్నారు.