టిటిడిపి అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత... ఏఐజి హస్పిటల్ కు తరలింపు
టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్లో చేరారు.

హైదరాబాద్ : తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఏఐజి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం. కాసాని అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఇక టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నిన్న కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. రాజకీయంగా కక్షసాధించేందుకే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయించారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఓటమిని జగన్ గుర్తించాడని... అందువల్లే ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబును నిలువరించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అంటూ అలజడి రేపారన్నారు. అసలు ఆ వ్యవహారంతో సంబంధమే లేని చంద్రబాబును ఏ1 గా చేర్చి అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఏం చేసినా ఏపీలో టిడిపి విజయాన్ని అడ్డుకోలేరని కాసాని అన్నారు.
వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ ప్రజాస్వామ్యబద్ద పాలన సాగించడం లేదని... ప్రతిపక్షాలతో వైసిపి వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని కాసాని అన్నారు. జగన్ తో పాటు వైసిపి నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని... ఆ రోజు దగ్గర్లోనే వుందన్నారు కాసాని జ్ఞానేశ్వర్.
Read More తెల్లవారు జామున 4 గంటలకు నిద్రపోయిన చంద్రబాబు: ఒక్క సహాయకుడు
పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళనలు చేపట్టాలని కాసాని పిలుపునిచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చేపట్టాలని టిటిడిపి అధ్యక్షుడు కాసాని పిలుపునిచ్చారు.