తెల్లవారు జామున 4 గంటలకు నిద్రపోయిన చంద్రబాబు: ఒక్క సహాయకుడు
మొదటి రోజు రాజమండ్రి కేంద్ర కారాగారంలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కష్టంగా గడిచింది. సోమవారం తెల్లవారుజాము 4 గంటల వరకు ఆయన నిద్రపోలేదని తెలుస్తోంది.

రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి నిద్రపోలేదని తెలుస్తోంది. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఆయన నిద్రకు ఉపక్రమించినట్లు సమాచారం అందుతోంది. దాంతో సోమవారం తెల్లవారు జామున ఉదయం 8 గంటల వరకు కూడా ఆయన నిద్రలేవ లేదు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయనను రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి తరలించారు.
జైలులోని స్నేహ బ్లాక్ లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించారు. ఆయనకు సహాయంగా ఓ వ్యక్తిని అనుమతించారు. ఐదుగురు సిబ్బందితో భద్రత కల్పించారు. ఆయనకు సోమవారం ములాఖత్ లు ఉండవచ్చు. కుమారుడు నారా లోకేష్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను చంద్రబాబును కలిసేందుకు అనుమతించే అవకాశాలున్నాయి. అల్పాహారాన్ని, ఇంటి భోజనాన్ని, మందులను సహాయకుడు చంద్రబాబుకు అందిస్తారు.
చంద్రబాబు నిద్రలేవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. నిద్ర లేచిన తర్వాత ఆయనకు జైలులోని ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. అల్పాహారం తీసుకున్న తర్వాత చంద్రబాబుతో ములాఖత్ కు నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరిలను అనుమతించే అవకాశం ఉంది.
చంద్రబాబు రిమాండ్ ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ (టిడిపి) సోమవారంనాడు బంద్ ను పాటిస్తోంది.