టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ జూనియర్ లైన్‌మెన్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రాత పరీక్షను జూలై 17న నిర్వహించారు. అయితే అందులో కొందరు అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్టుగా తేలింది. దీంతో పరీక్షను రద్దు చేశారు. 

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ జూనియర్ లైన్‌మెన్ పరీక్ష‌ను రద్దు చేశారు. వెయ్యి లైన్‌మెన్ పోస్టుల కోసం జూలై 17న ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష‌ను నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో కొందరు అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విచారణ చేపట్టగా.. 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్​కు పాల్పడినట్లు నిర్దారణ అయింది. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఘట్‌కేసర్‌లో ఏర్పాటు చేసిన ఓ పరీక్ష కేంద్రంలోకి పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థి ఫోన్‌తో పట్టుబడ్డాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరోవైపు తనకు పరీక్షలో సమాధానాలు చెబుతామని డబ్బులు తీసుకుని మోసం చేశారని మరో వ్యక్తి పోలీసులను అంబర్ పేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం వెనక ఉన్నవారిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలపై పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని తేలింది.

మాల్ ప్రాక్టీస్ చోటుచేసుకోవడంతో.. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ జూనియర్ లైన్‌మెన్ పరీక్ష‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే జూనియర్ లైన్‌మెన్ రిక్రూట్‌మెంట్‌కు మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.