తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. వచ్చే నెల 5 నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లుగా ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు మొత్తం 25 డిమాండ్లను నేతలను ప్రభుత్వం ముందుంచారు.

కొద్దిరోజుల ముందే ఆర్టీసీ ఎండీకి జేఏసీ నేతలు సమ్మెపై సమాచారం అందించారు. దీంతో అక్టోబర్ 4న కార్మిక శాఖ కమీషనర్ కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం, ఉద్యోగ భద్రత, అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ, వేతన సవరణ, కొత్త బస్సుల కొనుగోలుతో సహా తాము ప్రభుత్వం ముందు 25 డిమాండ్లు ఉంచామన్నారు.

సమ్మెపై నెల రోజుల కిందటే నోటీసు ఇచ్చినా ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదని నేతలు మండిపడ్డారు. ప్రజా రవాణా వ్యవస్థ బతకాలంటే ప్రజలందరూ తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమ్మె నుంచి పారామెడికల్, భద్రతా సిబ్బందికి మినహాయింపు ఇస్తున్నామని వారు కార్మికులకు సంఘీభావంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.

సంబంధిత వార్తలు:

టీఎస్‌ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్