హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన18వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు 18 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 18వ రోజు సికింద్రాబాద్ లోని జేబీఎస్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు వంటా వార్పు కార్యక్రమం నిర్వహంచారు. 

టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు చేపట్టిన ఈ వంటా వార్పు నిరసన కార్యక్రమానికి అఖిలపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు. బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలతోపాటు టీజేఎస్, జనసేన పార్టీ నేతలు కూడా వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. 

ఇకపోతే 18వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. సమ్మెలో  భాగంగా కార్మికులు వేకువజామునే కరీంనగర్ బస్ స్టేషన్‌కు చేరుకొని నిరసనకు దిగారు. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో అద్దం ధ్వంసమైంది. 

డిపో నుంచి బస్సులను తీసేందుకు తాత్కాలిక డ్రైవర్లు ప్రయత్నించగా వారిని ఆర్టీసీ యూనియన్ నేతలు అడ్డుకున్నారు. సమ్మెకు సహకరించాలని బస్సులు నడిపేందుకు ప్రయత్నించిన తాత్కాలిక డ్రైవర్‌లను కోరారు. పూలు ఇచ్చి తమకు మద్దతు ప్రకటించాని కోరారు. 

బస్‌ స్టేషన్‌లో ఉన్న బస్సును డిపోలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దాంతో కాసేపు బస్సులు బయటికి వెళ్లకుండా నిలిచిపోయాయి. బస్సులను అడ్డుకున్న జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇకపోతే ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపోతే విద్యార్థుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. కళాశాలలకు వెళ్తేందుకు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఇకనైనా ప్రబుత్వం చొరవ చూపి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై దృష్టి సారించాలని విద్యార్థులు, ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుని ఇరువురు చర్చించుకుని సమ్మెను రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.