హైదరాబాద్: ఆర్టీసి కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యవహరిస్తున్న తీరుపై బిజెపి నేత ఇంద్రసేనా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ ను చూస్తే సద్దాం హుస్సేన్ గుర్తుకు వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల భర్తీ లేకపోవడంతో ఫైల్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఒక్కో అధికారికి నాలుగైదు భాద్యతలు ఉన్నాయని, రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వరని ఆయన అన్నారు. ముఖ్యమైన శాఖలకు అధికారులు లేకపోవడంతో పాలన స్తంభించిపోయిందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన గాలిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 

 ప్రభుత్వ పాలన సరిగ్గా లేకపోవడం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికులు గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకునే నాధుడే లేడని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించకుండా తపోయించుకునే ధోరణిలో ఉందని వ్యాఖ్యానించారు. 

ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అంటూ ఎవరు భాద్యత వహిస్తారని ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అసమర్థ పాలన వల్ల ప్రజలు తీవ్రమైన సమస్యల ఎదురుకుంటున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. 

ఆర్టీసీ కార్మికులను సీఎం బెదిరించే పద్ధతి చూస్తుంటే హిట్లర్ గుర్తుకు వస్తున్నాడని ఆయన అన్నారు. కేసీఆర్ సద్దాం హుస్సేన్ తరహాలో మాట్లాడుతున్నాడని అన్నారు. కేసీఆర్ ఉద్యమంలో ఉన్నపుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళింది మర్చిపోయారా అని అడిగారు.  

అప్పటి ప్రభుత్వం కేసీఆర్ తరహాలో మాట్లాడితే ఎలా ఉండేదని ఆయన నిలదీశారు. నెల రోజుల క్రితం ఆర్టీసీ కార్మికులు నోటీసులు ఇస్తే కేసీఆర్ నిద్రపోతున్నాడా అని అడిగారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు స్వేచ్చలేదు, పనివిభజన లేదని అన్నారు. తెలంగాణ ఐఏఎస్ లు కేంద్రాన్ని సంప్రదించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అన్నారు.

ఆర్టీసీ కార్మికుల కు బీజేపీ పూర్తి సంఘి భావం తెలుపుతుందని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్మా ప్రయోగిస్తాం , ఉద్యోగాల నుండి తొలగిస్తాం అంటూ బెదిరించడం సరైందికాదని అన్నారు. 

ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమం చేసిందే ఆర్టీసీ కార్మికులని, పండుగ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వనిదేనని ఆయన అన్నారు.  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఒకటి రెండు రోజులు చేయొచ్చునని, కానీ వాళ్లకు శాశ్వత పరిష్కారం కావాలని అన్నారు.