Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా నుంచి వంద బస్సులు: బస్సులూ తాత్కాలిక సిబ్బందిపై దాడులు

ఆర్టీసి సమ్మె సందర్భంగా పలు చోట్ల ఆర్టీాసి బస్సులపై, తాత్కాలిక కండక్టర్లూ డ్రైవర్లపై దాడులు జరిగాయి. ఎస్కార్ట్ పోలీసుల ముందే దాడి జరిగిన సంఘటన కూడా చోటు చేసుకుంది. 

TSRTC strike: attack on buses, 100 buses from krishna
Author
Hyderabad, First Published Oct 5, 2019, 3:06 PM IST


హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడుపుతోంది. ఈ నేపథ్యంలో బస్సులపై పలు చోట్ల దాడులు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం బోగారం దగ్గర.. ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రైవేట్ డ్రైవర్ సురేష్‌కు గాయాలు అయ్యాయి.

పరిగి నుంచి వికారాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సుపై సైతం రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం చేయగా, ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఎస్కార్ట్ పోలీసుల ఎదుటే బస్సుపై ఈ దాడి జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ దగ్గర.. ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి.

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ఆర్టీసీ ఐకాస 

ప్రభుత్వం విధించే డెడ్‌లైన్లకు కార్మికులు బెదరబోరని తెలంగాణ ఆర్టీసీ ఐకాస నేతలు స్పష్టం చేశారు. సమ్మె విషయంలో వెనక్కి తగ్గబోమని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఐకాస అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డితోపాటు పలువురు నేతలు ఎంజీబీఎస్‌ను సందర్శించారు. సమ్మె జరుగుతున్న తీరును పరిశీలించారు. కార్మికులంతా సమ్మెలో పాల్గొంటూ దిగ్విజయం చేస్తున్నారని వారు అన్నారు. 

ఇకనైనా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంజీబీఎస్‌ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెతో కార్మికులు నైతిక విజయం సాధించారని ఈ సందర్భంగా ఐకాస నేతలు పేర్కొన్నారు.

తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్లపై దాడి 

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె యాదగిరిగుట్ట డిపో వద్ద ఉద్ధ్రిక్తంగా మారింది. బస్సు నడిపేందుకు సిద్ధమైన తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్లపై సమ్మెల్లో పాల్గొన్న ఓ మహిళా కండక్టర్‌ దాడికి దిగారు. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించగా.. అక్కడున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిపోలోని 470 మంది కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. 

ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కొందరికి ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు  చేయాలనే సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు అర్హత కలిగి కొందరు బయటి వ్యక్తులను విధుల్లోకి తీసుకున్నారు. దీంతో డిపో పరిధిలోని 105 బస్సుల్లో 20 బస్సులు కదిలాయి..

కృష్ణా జిల్లా నుంచి తెలంగాణకు 100 బస్సులు 

తెలంగాణలో పలు ప్రాంతాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. కృష్ణా జిల్లా నుంచి అధికారులు తెలంగాణకు 100 బస్సులను పంపారు.
విజయవాడ సిటీ సర్వీస్‌లతో పాటు.. ఇతర డిపోల నుంచి కొన్ని సర్వీస్‌లను హైదరాబాద్‌కు నడుపుతున్నామని కృష్ణా జిల్లా ఆర్టీసీ ఆర్‌ఎం నాగేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.   

Follow Us:
Download App:
  • android
  • ios