హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వానికి తెలంగాణ ఆర్టీసి కార్మిక సంఘం నాయకుడు అశ్వత్థామ రెడ్డి సవాల్ విసిరారు. ఎంత మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తారో చూస్తామని ఆయన సవాల్ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల లోగా రిపోర్టు చేయకపోతే ఉద్యోగాల నుంచి తొలగించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా చెప్పారు. 

తమను రెచ్చగొడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చిరించారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రవేట్ వాహనాలను నడిపిస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ వాహనాలతో ప్రమాదాలు జరుగుతాయని ఆయన అన్నారు. 

ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగడంతో డిపోలకే బస్సుల పరిమితమయ్యాయి. గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బస్సులు నడుస్తున్నాయి. న్యాయపరమై న డిమాండ్లను పరిష్కరించాలని అశ్వత్థామ రెడ్డి కోరారు. 

ఇదే పోరాటాన్ని కొనసాగించాలని ఆయన కార్మికులను కోరారు. తమ నిర్ణయంలో ఏ విధమైన మార్పు లేదని ఆయన చెప్పారు.