తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే ఆర్టీసీ బస్సులను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్ఆర్టీసీ ఎండీ . ఏపీలో ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా బస్సులను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉదయం బయల్దేరిన బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సు సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని టీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు. 

Also Read:ఏపీలో అమలులోకి వచ్చిన 18గంటల కర్ఫ్యూ: వివాహ వేడుకలకు 20 మందే

మరోవైపు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున ఐదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రజారవాణాను సైతం నిలిపివేసింది ఏపీ సర్కార్.

కర్ఫ్యూ మినహా మిగిలిన కొన్ని గంటల వ్యవధిలో ప్రయాణించేవారు తక్కువగా ఉంటారని.. బస్సులు నడిపినప్పటికీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని టీఎస్​ ఆర్టీసీ భావించింది. ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనే వరకు సర్వీసులను ఆపడమే మంచిదని అధికారులు నిర్ణయించారు. కర్ఫ్యూ కారణంగా ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులు, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులను ఎంజీబీఎస్‌లో నిలిపివేశారు.