ఏపీలో అమలులోకి వచ్చిన 18గంటల కర్ఫ్యూ: వివాహ వేడుకలకు 20 మందే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 గంటల కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కరోనా వైరస్ ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూను అమలు చేస్తోంది. నిత్యావసర సరుకుల రవాణాకు మినహాయింపు ఇచ్చింది.
అమరావతి: ఏపీలో కరోనా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాల పాటు ప్రతీరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు కానుంది. నేటి నుంచి ఈనెల 18 వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ విధిస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడి ఉండటానికి వీల్లేదు. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు వాటిని మూసివేయాలి.ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్‌లు, ఔషద దుకాణాలతో పాటు కొన్ని అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.
ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకుని వాటిని వాయిదా వేసుకోలేని పరిస్థితుల్లో నిర్వహించే వివాహాది వేడుకలకు 20కి మించి హాజరుకాకూడదని ఉత్తర్వుల్లో ప్రకటించింది. అది కూడా స్థానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతితో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించుకోవాలి.
ప్రభుత్వం మినహాయించిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్న వారు తప్ప మిగతా వ్యక్తులు ఎవరూ కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీలు లేదని స్పష్టం చేసింది.
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతో సహా, వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ వ్యవసాయ శాఖ జారీ చేసే కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. తయారీ రంగానికి చెందిన పరిశ్రమలకు మినహాయింపు నిచ్చారు.