తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రకటించేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగిపోయారు. దీంతో... బస్సులన్నీ.. డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులను నచ్చచెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. కానీ వారి చర్చలు విఫలమయ్యాయి. దీంతో... ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగుతోంది.

ఈ బంద్ తీవ్రత ఎలా ఉంది అనడానికి ఇదిగో ఈ ఫోటోనే చక్కని ఉదాహరణ. రాత్రికి రాత్రి బంద్ అంటూ ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. కానీ ప్రస్తుతం పండగ సమయం. దసరాకి అందరూ ఊర్లకు వెళ్లాలని టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. తీరా.. తెల్లారితో ఊరికి వెళదామని అనుకునేలోపు బంద్ ప్రకటించారు. అదేంటి.. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో బస్సులు నడుపుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. నిజంగానే తిరుగుతున్నాయి కానీ.. అవి అరకొర మాత్రమే. గంటకో, రెండు గంటలకో ఒక బస్సు రోడ్డు మీద కనపడుతోంది.

దీంతో ఊళ్లకు వెళ్లాలని అనుకున్నవారి ఆశలు గల్లంతయ్యాయి. ఇదిగో ఈ ఫోటోలో చిన్నారి కూడా.. ఎంజీబీఎస్ బస్టాండ్ లో కూర్చొని బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రైవేటు వ్యక్తులతో నడిపే బస్సులు కూడా ఎప్పుడు వస్తాయా అంటూ చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇలానే ఎదురు  చూస్తున్నారు. కేవలం ఊర్లు వెళ్లేవారి పరిస్థితి మాత్రమేకాదు.. హైదరాబాద్ నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారి పరిస్థితి కూడా ఇలానే ఉంది.

ఇతర వాహనాలు ఏదైనా ప్రయత్నిద్దామా అంటే.. జేబులకు చిల్లులు పడేలా ఉన్నాయి. ఆటో వాళ్లని అయితే అసలు కదిలించే పరిస్థితి కూడా లేదు. కిలో మీటరుకి దూరానికి కూడా రూ.100 తక్కువ చెప్పడం లేదు. మరి ప్రజలు ఇంతలా ఇబ్బందిపడుతుంటే...  సమ్మె విరమించేందుకు ప్రభుత్వం చర్చలు తీసుకుంటుందో  లేదో చూడాలి.