హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టీసి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం చేయవద్దని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసి) యాజమాన్యం తమ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, నోటి మాటగా ఆ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్టీసి ఉద్యోగులకు, వారి కుటుంబాలకు వైద్యం అందించడానికి సికింద్రాబాదులోని తార్నాకాలో సంస్థ ఆస్పత్రి ఉంది. 

రాతపూర్వకమైన ఆదేశాలు ఇస్తేనే దాన్ని పాటిస్తామని ఆస్పత్రి అధికారులు తేల్చి చెప్పారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను డిస్మిస్ చేసినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇటీవల ప్రకటించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందించవద్దని కేసీఆర్ ప్రకటన వెలువడిన తర్వాత యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. 

అధికారికమైన రాతపూర్వక ఆదేశాలు ఇస్తేనే సమ్మె చేస్తున్న ఉద్యోగులకు వారి కుటుంబాలకు వైద్య సేవలు నిలిపేస్తామని ఆస్పత్రి అధికారులు తేల్చి చెప్పారు. సమ్మె కొనసాగిస్తూ వారంతట వారు ఉద్యోగులు డిస్మిస్ అయ్యారని చెప్పి వైద్య సేవలు నిలిపేయడం అప్రజాస్వామిక చర్య అవుతుందని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.