మంగళవారం రాత్రి హైదరాబాద్ సీబీఎస్‌లో చోరికి గురైన బస్సు ఆచూకీని పోలీసులు మహారాష్ట్రలోని నాందేడ్‌లో కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే. మంగళవారం కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నైట్ హాల్ట్ డ్యూటీలో ఉంది.

డ్రైవర్, కండక్టర్ గౌలిగూడలో బస్సును పార్కింగ్ చేసి విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు డ్రైవర్, కండక్టర్ బస్సు పార్క్  చేసిన స్థలం వద్దకు వచ్చారు. అయితే అక్కడ బస్సు లేకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... బస్సు ఆచూకీ కోసం 44వ నెంబర్ జాతీయ రహదారి వెంట ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. బస్సు తూప్రాన్ టోల్‌ప్లాజా దాటి నిర్మల్ వరకు వెళ్లినట్లు గుర్తించారు.

ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కెమెరాలను పరిశీలించగా.. నాందేడ్, నాగ్‌పూర్‌లలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలంచగా నాందేడ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే నాందేడ్ వెళ్లిన పోలీసులకు అప్పటికే స్క్రాప్ దుకాణానికి విక్రయించడం.. వారు బస్సు మొత్తాన్ని విడిదీయడం జరిగిపోయింది.

బస్సును చోరీ చేసింది ఇద్దరు నిందితులని.. వారు కేవలం నాలుగు గంటల్లోనే బస్సును నాందేడ్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ పనికి పాల్పడింది గ్యాస్ వెల్డింగ్, కటింగ్ చేసేవారని పోలీసులు వెల్లడించారు.

బస్సును దొంగిలించిన తర్వాత వారి నాందేడ్‌లోని వారి స్నేహితులైన మరో ఐదుగురు గ్యాస్ వెల్డర్లకు విషయం చెప్పారు. దీంతో అందరూ కలిసి బస్సులోని ప్రధాన భాగాలైన ఇంజిన్, ఇతర విడిభాగాలను వేరు చేసి ఆటోలో వేరే ప్రాంతానికి తరలించారు.

పోలీసులు సరిగ్గా అక్కడికి రావడంతో బస్సు పూర్తిగా ధ్వంసం కాకుండా అడ్డుకోగలిగారు. ఈ ఘటనలో బస్సు చోరీకి పాల్పడిన ప్రధాన నిందితులు పరారీలో ఉండగా.. వారికి సహకరించిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు చోరీ ఘటనపై రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులతో సమావేశమైన ఆయన కట్టుదిట్టమైన భద్రత ఉండే గౌలిగూడ బస్టాండ్ నుంచి బస్సు ఎలా చోరీ అవుతుందంటూ ఫైర్ అయ్యారు.