నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా రఘుపతిపేటలో దుందుభివాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకొంది. ఆర్టీసీ బస్సును  పోలీసులు ఆదివారం నాడు ఉదయం వాగు నుండి సురక్షితంగా బయటకు తీశారు. 

వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకొన్న సమయంలో సుమారు 10 మంది ప్రయాణీకులు ఉన్నట్టుగా సమాచారం. వాగు నుండి బస్సును సురక్షితంగా తీయడంతోనే  అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.  దుందుభి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 

అయితే వాగు ఉధృతిని అంచనా వేయకపోవడంతో వరద ఉధృతిలో బస్సు చిక్కుకొంది.దుందుభి వాగు వరద ఉధృతంగా ప్రవహించడంతో పోలీసులు నాగర్ కర్నూల్ తెలకపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

2019 అక్టోబర్ మాసంలో ఇదే తరహాలోనే కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూడ వాగులో చిక్కుకుపోయింది.  బస్సులోని ప్రయాణీకులను స్థానికులు రక్షించారు.

ఆదివారం నాడు కూడ రఘుపతిపేట వద్ద ఆర్టీసీ బస్సు దుందుభి వాగులో చిక్కుకుపోయిన విషయాన్ని తెలుసుకొన్న పోలీసులు సురక్షితంగా బస్సును వాగు నుండి బయటకు తీశారు.

గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్సాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.