Asianet News TeluguAsianet News Telugu

 ప్రయాణికులకు TSRTC బంపరాఫర్.. ఈ టికెట్లపై ప్రత్యేక రాయితీ..  

ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ( TSRTC) శుభవార్త చెప్పింది. వేసవిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్థికభారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

tsrtc bumper offer for passengers you can move around the city with rs90 KRJ
Author
First Published Apr 27, 2023, 8:43 AM IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికులకు ఓ తీపికబురు చెప్పింది. వేసవి కాలంలో ప్రయాణికులకు ఓ బంపరాఫర్ ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, జంట నగరాల్లో పర్యటించాలనుకునే వారికి మరింత చేరువ అయ్యేందుకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను తీసుకవచ్చింది. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఇప్పటికే టి-24 టికెట్‌ను అందజేస్తోన్న ఆర్టీసీ సంస్థ.. ఆ టికెట్ పై 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోంది. అంటే.. సాధారణంగా టి-24 టికెట్ ధరను రూ.100 ఉండగా.. ఇప్పుడు రూ.90కే అందించనున్నది.

అంతేకాదు.. సీనియర్ సిటిజన్లకు మరింత రాయితీని కల్పించింది. వారికి రూ.80కే ఆ టికెట్ ను అందించనుంది. ఈ  ఆఫర్ 60 ఏళ్ళు పైబడిన వారికి వర్తిస్తోంది. వారు టి-24 టికెట్ పై 20 శాతం రాయితీని పొందవచ్చు. ఈ ఆఫర్ పొందాలనుకునే వారు బస్ కండక్టర్లను, బస్ స్టాప్ ల్లోగానీ సంప్రదించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కొత్త టి-24 టికెట్ ధరలు గురువారం నుంచి అమల్లోకి రాగా, శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులోకి రానున్నాయి.  

ఆ టికెట్‌ను కొనుగోలు చేసిన వారు.. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. తొలుత ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించారు.  ఆ తర్వాత టి-24ని 100కి తగ్గించింది. తాజాగా సమ్మర్ ఆఫర్ పేరుతో  టి-24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. టీ-24 టికెట్‌కు మంచి స్పందన వస్తోందని, సగటున రోజుకు 25 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయని TSRTC అధికారులు తెలిపారు.

ఇటీవల మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 పేరిట టికెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.50తో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అలాగే.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్‌ను అందుబాటులోకి తీసుకవచ్చారు. రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. 

సిటీ పరిధిలో తిరిగే  ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios