కాంగ్రెస్ రైతు వ్యతిరేకి.. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : తెలంగాణ రెడ్‌కో చైర్మన్ వై సతీష్ రెడ్డి
BRS: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళారీలా వ్యవహరిస్తున్నారనీ, రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. రైతుబంధు పథకంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రైతు బంధుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీఆర్ఎస్.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
Revanth Reddy- Rythu Bandhu scheme: రైతుబంధు పథకంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ రెడ్కో) చైర్మన్ వై.సతీష్ రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి రుజువైందనీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు దీనికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రేవంత్ రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు భిక్షగా రూ.10వేలు ఇస్తోందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.15వేలు అందిస్తామని చెప్పారు.
రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారనీ, దానిని టీపీసీసీ చీఫ్ భిక్షగా అభివర్ణిస్తున్నారనీ, ఇది చాలా దురదృష్టకరమని వై సతీష్ రెడ్డి అన్నారు. ఆయన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టారని అన్నారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతు బంధు వంటి పథకానికి రూపకల్పన గురించి ఆలోచించలేదనీ, ఈ పథకం ద్వారా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే రేవంత్ రెడ్డి దానిని భిక్షగా చూస్తున్నారని మండిపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు, రైతుబంధుపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడంపై ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో ఆయన తన అభ్యర్థిత్వం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారనీ, రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఆశావహులకు టిక్కెట్లు ఇచ్చే ముసుగులో రేవంత్ రెడ్డి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని రేవంత్ రెడ్డి అనడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్ణాటకలో ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించారు.