తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సిట్ అధికారులు అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య 14కు చేరింది.  

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తొలుత 9 మందిని అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత మరికొందరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 14కి చేరింది. అరెస్ట్ అయిన వారిలో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్, రేణుకా, నీలేష్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్ నాయక్, షమీమ్, సురేష్, రమేష్ నాయక్, ప్రశాంత్ రెడ్డి, రాజేందర్ కుమార్‌లు ఉన్నారు. ఈ కేసులో తొలుత అరెస్ట్ చేసిన 9 మంది నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా వారిలో నలుగురు నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్‌లను మూడు రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు ఈ నెల 25న కోర్టు అనుమతించింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు ఆదివారం(మార్చి 26) రోజున నలుగురు నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి వారిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి తరలించారు. దాదాపు 8 గంటల పాటు నలుగురు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. 

అయితే నేడు రెండో రోజు కూడా నలుగురు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం సీసీఎస్‌ నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి కీలకంగా ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కస్టడీలోకి తీసుకున్న నలుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మరో ముగ్గురిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరి కస్టడీ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొందరి అరెస్ట్‌లు జరిగే అవకాశం కనిపిస్తుంది. 

100కు పైగా మార్కులు సాధించిన వారిపై దృష్టి.. 
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు.. గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 150 మార్కులకు గానూ వందకు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులందరి జాబితాను సేకరించారు. ఇందులో సిట్ అధికారులు పలువురిని విచారణకు పిలుస్తున్నారు. వీరిని విచారించేందుకు.. 15 ప్రశ్నలతో కూడిన జబితాను సిద్దం చేశారు. వారి ప్రస్తుత ఉద్యోగం, పోటీ పరీక్షలు, గతంలో వారు రాసిన టీఎస్‌పీఎస్సీ పరీక్షలు.. వాటిలో సాధించిన మార్కుల గురించి వారిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. వివిధ జిల్లాల నుంచి 15 మందికి పైగా అభ్యర్థులు వారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఆదివారం హిమాయత్ నగర్‌లోకి సిట్ కార్యాలయానికి రాగా.. అధికారులు వారి నుంచి వివరాలు సేకరించారు.