Asianet News TeluguAsianet News Telugu

నేటినుంచి గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ.. త్వరలో మరిన్ని ఉద్యోగ ప్రకటనలు..

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. నేటినుంచి అంటే శుక్రవారం గ్రూప్ 4 ధరఖాస్తుల ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతోంది. దాదాపు పదివేల పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 

TSPSC Group 4 applications from today in Telangana
Author
First Published Dec 23, 2022, 8:10 AM IST

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభమవుతుంది. ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నా సమయం రానే వచ్చింది. ప్రభుత్వంలోని మొత్తం 25 వివిధ విభాగాల పరిధిలో 9,168 పోస్టులకు టిఎస్పిఎస్సి ఇప్పటికే ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు డిసెంబర్ 23 నుంచి అంటే నేటి నుంచి 2023 జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు కమిషన్ తెలిపింది. జిల్లాల వారీగా దీనికి సంబంధించిన పోస్టులతో కూడిన సమగ్ర ప్రకటనతో పాటు..  ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియకు పూర్తి ఏర్పాట్లు చేసింది.  

అప్లికేషన్ పెట్టుకోవడానికి మూడు వారాల గడువు ఇచ్చింది. ఈ అప్లికేషన్ లను పరిశీలించిన తర్వాత ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. అది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే కమిషన్ వెల్లడించింది. 9,168 గ్రూపు -4 ఉద్యోగాలు దీనిద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాల్లో 2,701 పురపాలక శాఖ పరిధిలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మొత్తం ఉద్యోగాల్లో ఇవే ఎక్కువ శాతం ఉన్నాయి. ఇక రెవెన్యూ శాఖ పరిధిలో 2077 పోస్టులు ఉన్నాయి. వీటిలో కూడా  సీసీఎల్ఏ పరిధిలో 1,294  పోస్టులు ఉన్నాయి. సంక్షేమ గురుకులాల్లో,  సాధారణ గురుకులాల్లో  1991 పోస్టులు  ఖాళీలు ఉన్నాయి. 

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉంటే చాలు: కరోనా పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు ఉన్నత స్థాయి సమీక్ష

ఇక ఇక వివిధ ప్రభుత్వ విభాగాల్లో కలిపి మొత్తం 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 1,862 వార్డు అధికారులు పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు.. ఈ గ్రూప్-4  ప్రక్రియ ద్వారా భర్తీ కానున్నాయి. చాలా కాలం తర్వాత గ్రూప్-4 దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో.. భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని  కమిషన్  అంచనావేస్తోంది. కనీసం ఆరేడు లక్షల మధ్యలో అప్లికేషన్లు రావచ్చని  గత అనుభవాలను బట్టి  అంచనా వేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్వో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే దాదాపు పది లక్షల మందికిపైగా అప్లై చేసుకున్నారు.  

వీరిలో 76 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. అంతేకాదు, అంతకు ముందు గ్రూప్ ఫోర్ కేటగిరీలో రెండు వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడిన అప్పుడు కూడా 4.8 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఈ రెండింటికి మించి ప్రస్తుతం దాదాపు పదివేల పోస్టులు.. 9,168 పోస్టులకు  నోటిఫికేషన్ జారీ చేయడంతో.. మరి ఇంత భారీ స్థాయిలో అభ్యర్థులు అప్లికేషన్లు పెడతారని  ఊహిస్తున్నారు.

గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు కూడా.. 
గ్రూప్-4తో పాటు టిఎస్పిఎస్సి గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు కూడా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు  సన్నాహాలు పూర్తి చేసింది. మరిన్ని ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను గ్రూప్-2, గ్రూప్-3 కేటగిరి పరిధిలోకి చేర్చి, ఈ మేరకు  ఎక్కువ పోస్టులను  గుర్తించింది. వీటిని ప్రస్తుత గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల  ప్రకటనల్లో చేర్చింది. గ్రూప్ టు కింద మొదట 663 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే, టిఎస్పిఎస్సి  చేసిన కసరత్తు మేరకు చేసిన కొత్తగా  అదనంగా చేరిన పోస్టులతో కలిపి మొత్తం ఖాళీల సంఖ్య 783కి చేరింది. 

అలాగే గ్రూప్ త్రీ కింద మొదట 1,373 పోస్టులకు ప్రభుత్వం అనుమతించింది. కాగా, టిఎస్పిఎస్సి చేసిన కసరత్తు వల్ల.. దీంట్లో కూడా కొత్తగా అదనంగా మరో వంద పోస్టులు చేరనున్నాయి. ఈ మేరకు ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు వెలువరించేందుకు టిఎస్పిఎస్సి బోర్డు  ఇప్పటికే  ఆమోద ముద్ర వేసింది. అయితే, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా న్యాయ, విద్యార్హతలు, సాంకేతిక పొరపాట్లు  జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే..  త్వరలోనే ప్రకటనలను జారీ చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios