Asianet News TeluguAsianet News Telugu

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉంటే చాలు: కరోనా పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు ఉన్నత స్థాయి సమీక్ష 

కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7పై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులకు  విమాన సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కరోనా పరిస్థితులపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా నివారణ చర్యలతో పాటు సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. 

Finance , Health Minister Harish Rao high level review on Corona situation.
Author
First Published Dec 22, 2022, 11:30 PM IST

ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లు దేశాల్లో క‌రోనా కేసులు క్ర‌మంగా పెర‌గుతున్నాయి. జ‌పాన్, చైనా, అమెరికా తోస‌హా ప‌లు ఆసియా దేశాల్లో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి ఇటీవ‌ల గుర్తించిన కొత్త వేరియంట్లే (బీఎఫ్.7) కార‌ణ‌మ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నాయి.

తాజాగా సంబంధిత వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్రప్ర‌భుత్వం  .. రాష్ట్రప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు కోవిడ్-19పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. కేసులు పెరుగుతున్న క్ర‌మంలో  కోవిడ్ 19 మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నాయి. 

ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులకు  విమాన సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంతో  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వైద్యారోగ్య మంత్రి  హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా పట్ల ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు.

కొవిడ్ వాక్సిన్, బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. పలు దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి, కొవిడ్ 19 సన్నద్ధతపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జూమ్ ద్వారా గురువారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్.7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆరోగ్య శాఖ కోవిడ్ సన్నద్ధత పై మంత్రి సూచనలు చేశారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో తెలంగాణ కరోనాను విజయవంతంగా ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో కరోనా వ్యాప్తి లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. మానవ వనరులు, మందులు, ఆక్సిజన్, ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేంద్రం సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆస్ప‌త్రికి పంపాలని, అలాగే.. ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని మంత్రి హ‌రీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్ట‌ర్ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios