టీఎస్‌పీఎస్సీ ఆదివారం రోజున గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష‌ను నిర్వహించింది. అయితే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో హాల్ టికెట్ వివాదం చర్చనీయాంశంగా మారింది.

టీఎస్‌పీఎస్సీ ఆదివారం రోజున గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష‌ను నిర్వహించింది. మొత్తం 503 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకోసం నిర్వహించిన పరీక్షకు 3 లక్షల 80 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా 2,32,457 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్టు అధికారులు తెలిపారు. అయితే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో హాల్ టికెట్ వివాదం చర్చనీయాంశంగా మారింది. గ్రూప్-1 పరీక్షకు అప్లై చేసుకోకుండానే ఓ యువతికి హాల్ టికెట్ జారీ అయినట్టుగా తెలుస్తోంది. నిజమాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన జక్కుల సుచిత్ర అనే యువతి గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టుగా చెబుతోంది. అయితే ఆమెకు గ్రూప్-1 హాల్ టికెట్ కూడా జారీ అయిందని తెలిసింది. 

అయితే తాను గ్రూప్-1‌కు అప్లై చేయకుండానే తనకు హాల్ టికెట్ రావడంతో ఆందోళన చెందినట్టుగా సుచిత్ర చెప్పింది. అయితే హాల్ టికెట్ వచ్చినప్పటికీ.. పరీక్ష కేంద్రానికి వెళ్లలేదని తెలిపింది. అయితే గతంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గ్రూప్-1 అప్లై చేయకపోయినా.. హాల్ టికెట్‌ జారీ అయిందని సుచిత్ర చెప్పడంతో గందగోళం నెలకొంది. మరి దీనిపై టీఎస్‌పీఎస్సీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. 

ఇక, రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు 61.37 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తంగా 2,33,248 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. నిరుడు జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది అంటే 79.15 శాతం మంది హాజరు అయ్యారు. కాగా, పేపర్ లీకేజీ తర్వాత రెండోసారి నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 53,000 మంది దూరంగా ఉండడం గమనార్హం.

గతంలో జరిగి, రద్దయిన ప్రిలిమినరీ పరీక్షతో పోలిస్తే ఈసారి.. పరీక్షలో ప్రశ్నలు కాస్త సులభంగానే వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు మాత్రం..ప్రశ్నలు చదివి అర్థం చేసుకుని.. సమాధానాలను గుర్తించేందుకు.. ఒక్కో ప్రశ్నకు సగటున రెండు నిమిషాల చొప్పున పట్టిందని చెబుతున్నారు.